మొక్కల మాటున అవినీతి చీడ  | Sakshi
Sakshi News home page

మొక్కల మాటున అవినీతి చీడ 

Published Tue, Jun 18 2019 10:56 AM

Plantation Funds Are Misused - Sakshi

సాక్షి, కాకినాడ(తూర్పు గోదావరి): వన సంరక్షణ ...వన మహోత్సవం...ఇలా రకరకాల పేర్లతో గత ప్రభుత్వం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. మీడియాలో ప్రకటనలు... పత్రికల్లో ఫొటోలతో తెగ హల్‌చల్‌ చేశారు. ప్రజల్ని భాగములను చేసి మొక్కలు నాటే కార్యక్రమం చేసినట్టు ఆర్భాటం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది ... ఆ మొక్కల మాటున అవినీతికి పాల్పడి లక్షల రూపాయల నిధులు స్వాహా చేశారు. సంరక్షణ గాలికొదిలేయడంతో ఎదగాల్సిన మొక్కలు ఆదిలోనే ఎండిపోయాయి.
ఓ కాలానికి  పరిమితం కావల్సిన ఎండలు దాదాపు ఏడాదంతా విరగగాయడానికి కారణం పచ్చదనం లేకపోవడమే. గాలిలో ఉన్న కార్బన్‌ డై ఆక్సైడ్‌ నిల్వలు బాగా పెరిగిపోతుండటంతో భూతాపం అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేప«థ్యంలో ఆడవులను సంరక్షించుకోవడంతో పాటు పచ్చదనాన్ని పెంచే బాధ్యతలను ప్రతి ఒక్కరూ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ పని సమర్ధవంతంగా చేయాల్సిన గత ప్రభుత్వం నిధులెలా ఖర్చు చేయాలో చూసిందే తప్ప మొక్కలెలా పెంచాలో శ్రద్ధ పెట్టలేదు. మొక్కలు పెంపకం పేరుతో నిధులు మింగేసిన సందర్భాలు చోటుచేసుకున్నాయి. అధికారుల వద్ద లభ్యమైన రెండేళ్ల అధికారిక లెక్కలు పరిశీలిస్తే అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. 

  • ∙2016–17లో 32 మండలాల్లో 1,87 156 మొక్కలు నాటినట్టుగా చూపించారు. ఇందులో 84, 233 మొక్కలు బతికున్నట్టుగా రికార్డుల్లో చూపిస్తున్నారు. అంటే 45 శాతం మొక్కలు ఊపిరిపోసుకున్నాయన్నమాట. 
  • ∙2017–18లో 51 మండలాల్లో  2,61,208 మొక్కలు నాటగా 1,35,828 మొక్కలు బతికినట్టు నివేదికలు తెలియజేస్తున్నాయి. అయితే, 2017–18 సంవత్సరానికి సంబంధించి 23 మండలాల్లో సామాజిక తనిఖీలు జరిపితే రూ.22,19,693మేర దుర్వినియోగం చేసినట్టు తేలింది. అంతకుముందు సంవత్సరాల్లో కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. వాటిలో బతికున్నవెన్నో అధికారుల వద్ద లెక్కల్లేవు.

ఎంత నిధులు దుర్వినియోగమయ్యాయో తేల్చే తనిఖీలు జరగలేదు. ఇదంతా అధికారికంగా చెబుతున్న సమాచారం. కానీ అనధికారికంగా చూస్తే వేసిన మొక్కలు ఎక్కడున్నాయో...ఏమయ్యాయో తెలియని పరిస్థితి ఉంది. ఈ లెక్కన మొక్కల పెంపకం కోసం చేసిన ఖర్చు బూడిదలో పోసిన పన్నీరుగా దుర్వినియోగమయింది. మొక్కలు వేసినందుకు, మొక్కలు పెంపక వేతనం, నీటి సరఫరా ఖర్చు, ఎరువులు, ఇతరత్రా వాటి కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసినట్టు లెక్కలు రాసుకున్నారు.

రికార్డుల్లో లెక్కలు చూపించారే తప్ప క్షేత్రస్థాయిలో వేసిన మొక్కలను పట్టించుకోకుండా నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్టుగా ఆరోపణలున్నాయి. విశేషమేమిటంటే  2017–18లో సామాజిక తనిఖీల్లో 22 లక్షలకుపైగా దుర్వినియోగం జరిగిందని, 300 మందికిపైగా అక్రమాలకు పాల్పడ్డారని తేల్చినా ఇంతవరకూ ఒక్క పైసా రికవరీ చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిబట్టి అక్రమాలను ఏ స్థాయిలో ప్రోత్సహించారో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని డ్వామా పీడీ ఎన్‌వీ రమణ దృష్టికి ‘సాక్షి’ తీసుకువెళ్లగా ‘నేను ఎన్నికల ముందు బాధ్యతలు స్వీరించానని, గతంలో ఏమి జరిగిందో తెలియదని, పరిశీలిస్తానని చెప్పారు.

2016–17లో మొక్కలు నాటిన మండలాలు  32
నాటిన మొక్కలు 1,87,156
మొత్తం వ్యయం 150.37 లక్షలు
బతికిన మొక్కలు 84, 233
బతికిన మొక్కల శాతం 45

2017–18లో సోషల్‌ ఆడిట్‌ చేసిన మండలాలు 23
దుర్వినియోగమైనట్టు తేల్చిన నిధులు రూ. 22,19,693
2017–18లో మొక్కలు నాటిన మండలాలు 51
నాటిన మొక్కలు 2,61,208
మొత్తం వ్యయం 946.11 లక్షలు
బతికిన మొక్కలు 1,35,828
బతికిన మొక్కలు శాతం 52 

Advertisement
Advertisement